హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..సిటీ రోడ్లపైకి 1,085 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 8:40 PM IST

Hyderabad News, TGSRTC, Olectra, Electric Buses, PMeDrive, PublicTransport, GreenMobility

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..సిటీ రోడ్లపైకి 1,085 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC), ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (OGL)కు 1,085 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎం ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా ఈ భారీ ఆర్డర్ దక్కింది. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పర్యవేక్షణలో నడపనున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఒలెక్ట్రా సంస్థ 12 మీటర్ల పొడవున్న అధునాతన లో-ఫ్లోర్ ఏసీ మరియు నాన్-ఏసీ బస్సులను సరఫరా చేయనుంది. అత్యాధునిక ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం కలిగిన ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల పైగా ప్రయాణిస్తాయి. కేవలం 45 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తయ్యేలా 'ఆపర్చునిటీ ఛార్జింగ్' సౌకర్యాన్ని కూడా వీటిలో కల్పించారు. అంతేకాకుండా, వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్ స్థలాన్ని కూడా కేటాయించడం విశేషం.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒలెక్ట్రా, దేశవ్యాప్తంగా ఇప్పటికే 3,600 వాహనాలను విజయవంతంగా నడుపుతూ, ప్రస్తుతం 10 వేల వాహనాల ఆర్డర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక ఘట్టం 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యానికి మరింత బలాన్నిస్తుందని, తమ స్వస్థలమైన హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీతో కలిసి సుస్థిరమైన రవాణా సేవలు అందించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో నగరంలో కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.

Next Story