హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది

By -  Knakam Karthik
Published on : 23 March 2026 7:04 PM IST

Hyderabad News, SriRamaNavami, Hyderabad ShobhaYatra, VC Sajjanar, Hyderabad Police, SitaramBagh

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

హైదరాబాద్: భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్ర రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు మరియు ఉత్సవ సమితి సభ్యులకు సీపీ కీలక దిశానిర్దేశం చేశారు. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ భారీ యాత్ర కోసం సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు, అడుగడుగునా సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ (SHE Teams), చైన్ స్నాచింగ్ అరికట్టేందుకు క్రైమ్ టీమ్స్‌ నిరంతరం పహారా కాస్తాయని సీపీ వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా యాత్రను మధ్యాహ్నం 1 గంటకే ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో ఇబ్బంది లేకుండా పెద్ద వాహనాలపై ముందస్తు ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ డ్రోన్ల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి అని, భక్తులందరూ క్రమశిక్షణతో సహకరించి వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Next Story