బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. వివిధ రూపాల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. కొన్ని సార్లు కస్టమ్స్ చెకింగుల్లో పట్టుబడిపోతున్నారు. మరికొన్ని సార్లు తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.
సుడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 23 మంది సూడాన్ జాతీయులపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారిలో నలుగురి వద్ద నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
వీరు షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీరంతా అధికారుల దృష్టి మరల్చేందుకు గ్రూపుగా వచ్చినట్లు బావిస్తున్నారు.
కాగా.. ఇటీవల కాలంలో సీజ్ చేసిన బంగారంలో ఇదే అత్యధికం అని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు చెప్పారు.