మరో నాలుగు రోజుల్లో వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా.. పండుగకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చేపట్టనుంది. ఉత్సవాల సమయంలో పర్యావరణ అనుకూల విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించే చొరవలో భాగంగా.. నగర పౌరులకు మట్టితో చేసిన సుమారు 4 లక్షల విగ్రహాలను పంపిణీ చేయనుంది. పంపిణీ చేయనున్న చాలా విగ్రహాలు ఎనిమిది అంగుళాలు కాగా, మిగిలినవి ఒక అడుగు, 1.5 అడుగుల ఎత్తు ఉన్నాయి. మార్కెట్‌ల వంటి రద్దీ ప్రదేశాల్లో కూడా మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.
పార్వతీపరమేశ్వరులు కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ వినాయక చవితినే గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవ్ అనే రకరకాల పేర్లుతో పిలుస్తారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆగస్టు 31న గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంత చతుర్థి నాడు సెప్టెంబరు 9న ముగుస్తాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఉత్సవాలు జరగడం లేదు. ఈ సంవత్సరం భారీ ఎత్తున వేడుకలు జరుపుకునేందుకు దేశమెుత్తం సిద్దమైంది.