ఆస్తిపన్ను బకాయిలపై GHMC గుడ్‌న్యూస్..ఓటీఎస్ స్కీమ్ కొనసాగింపు

ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది

By -  Knakam Karthik
Published on : 9 Jan 2026 9:56 AM IST

Hyderabad News, GHMC, property tax arrears, One Time Settlement Scheme, Congress Government

ఆస్తిపన్ను బకాయిలపై GHMC గుడ్‌న్యూస్..ఓటీఎస్ స్కీమ్ కొనసాగింపు

హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది. బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీతో వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కోరింది. ఈ మేరకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం 2025-26ను కొనసాగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటన విడుదల చేసింది.

కాగా ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుంది. ఈ పథకంతో పన్ను చెల్లింపుదారులు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్‌తో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే ఒక్కసారి చెల్లిస్తే..మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ కానుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్‌ఎంసి విజ్ఞప్తి చేసింది.

వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద చెల్లింపులు My GHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఆన్‌లైన్ విధానాల ద్వారా చేయవచ్చని పేర్కొంది. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో ఇప్పటివరకు ఆస్తి పన్ను పెండింగ్ బకాయిలు దాదాపు రూ.4,500 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బకాయిలే ఉన్నట్లు సమాచారం.

Next Story