బీజేపీలో చేరిన మాజీ మేయర్
GHMC Elections:Banda Karhika reddy Joins bjp .. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో
By సుభాష్ Published on 18 Nov 2020 1:06 PM GMTహైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కార్తిక రెడ్డి, ఆమె భర్త చంద్రారెడ్డికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని బీజేపీలో చేరడం తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను రెండు సార్లు మోసం చేసిందని.. బీజేపీలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే తాను ఈ పార్టీలో చేరానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను కార్పొరేటర్ గా పోటీ చేయడం లేదని, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.
అనంతరం భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే భాజపా లక్ష్యమన్నారు. రెండు పడకల గదుల ఇళ్లు ఎక్కడని పేదలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపించాలన్నారు. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ, నియంత పాలనను వ్యతిరేకంగా దుబ్బాకలో భాజపాను ప్రజలు గెలిపించారన్నారు.