గ్రేటర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

GHMC Elections 2020. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ సార‌థి తెలిపారు.

By Medi Samrat  Published on  30 Nov 2020 12:16 PM GMT
గ్రేటర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ సార‌థి తెలిపారు. బ్యాలెట్ పెట్టెలు స‌ర్కిళ్ల వారీగా స్ట్రాంగ్ రూమ్‌ల‌కు చేరుకున్నాయి. ఏ డివిజ‌న్‌లోనైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగి, ప‌రిశీల‌న త‌ర్వాత ఎన్నిక‌ల సంఘం అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశిస్తే డిసెంబ‌ర్ 3న రీపోలింగ్ నిర్వ‌హిస్తామ‌ని ఎన్నిక‌ల అథారిటీ డీఎస్ లోకేష్ కుమార్ ప్ర‌క‌టించారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం మొత్తం 9,101 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 45 వేల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని..6 గంటల వరకూ పోలింగ్ ఏజెంట్లు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమీషనర్ సూచించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 150 డివిజన్లకు గానూ 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

కొవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేయనున్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది.

నగర వ్యాప్తంగా మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగాను, 2934 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవి గాను, 4415 పోలింగ్ కేంద్రాలను సాధారణమైనవి గాను గుర్తించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ జరిగే ప్రాంతాలలో 450 పోలింగ్ ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి గా గుర్తించారు. 921 పోలింగ్ ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగాను గుర్తించారు. 1548 పోలింగ్ ప్రాంతాలను సాధారణమైనవిగాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు..

ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండేందుకు 52,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 30 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లను వినియోగించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశారు.


Next Story