జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రమైన ఘటన వెలుగుచూసింది. వివరాళ్లోకెళితే.. ఓల్డ్ మలక్ పేట్ వార్డ్ నంబర్ 26 లో సిపిఐ అభ్యర్థిగా ఫిర్థోసి ఫాతిమా ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ అంగీకరించి.. కంకి కొడవలి గుర్తును కేటాయించడం జరిగింది. కానీ బ్యాలెట్ పత్రం లో కంకి కొడవలి గుర్తుకు బదులుగా.. సుత్తి కొడవలి గుర్తు వచ్చింది.
ఇది ఎన్నికల వ్యవస్థ చేసినటువంటి పొరపాటని తక్షణమే ఓల్డ్ మలక్ పేట్ 26 వ వార్డు ఎన్నికలను నిలిపివేయాలని సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ. నరసింహ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఒకటికి పది సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలని.. కానీ.. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. డిజిటల్ వ్యవస్థ కంప్యూటర్ యుగంలో ఇలాంటి తప్పులు జరగడం సిగ్గుచేటని.. చిన్నచిన్న తప్పులకు నామినేషన్లు తిరస్కరించే అధికారులు ఇంత పెద్ద తప్పును ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్నించారు.
ఎవరి మెప్పు కోసం ఇలాంటి పొరపాటుకు పాల్పడ్డారో ఎన్నికల కమిషన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పులకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని అన్నారు.