గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం
GHMC Eections war .. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈసారి
By సుభాష్ Published on 18 Nov 2020 10:25 AM GMTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈసారి బల్దియాపై జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా ఈ రోజు నుంచి నామిషన్లు ప్రారంభం కావడం, ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎవరికి వారే ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా సమర్దులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.
బస్తీమే సవాల్ అన్నట్లు టీఆర్‌ఎస్ ముందుగా రెడీ అయింది. వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్, షెడ్యూల్‌నువిడుదల చేసింది. గ్రేటర్‌లో సీట్లు సాధించడమే కాకుండా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జెండా ఎగురవేయడం ఖాయమని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. మరో వైపు రిజర్వేషన్‌ల రచ్చ కొనసాగుతుంటే ఇంకోవైపు అధికార, విపక్షాల మధ్య డైలాగ్‌వార్ మామూలుగా లేదు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఊపుమీదున్న బీజేపీ.. గ్రేటర్‌లో పాగా వేయాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. కానీ టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదేమైనా తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉంది. దుబ్బాక ఓటమి అనేది తాము అప్రమత్తం కావడం కోసమేనని, దుబ్బాకలో తాము ఓడిపోలేదన్నది గులాబీ నేతల వాదన. కారు పోలిన గుర్తు కాంగ్రెస్‌కు ఉండటంతో తమకు పడే ఓట్లు పొరపాటున కాంగ్రెస్‌కు పడ్డాయని, లేకపోతే తాము విజయం సాధించేవారమని అన్నారు. కారును పోలి ఉన్న గుర్తులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దుబ్బాకలో రోటి మేకర్ గుర్తు వల్లే ఓడిపోయామని గులాబీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇస్తుండటంతో గ్రేటర్‌లో వార్ నెలకొంది. గ్రేటర్ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంలో తమ వాణి వినిపించుకునేందుకు రెడీగా ఉన్నారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల నగరా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లు కొనసాగుతోంది. ఇక గ్రేటర్‌కు మేయర్‌గా మహిళాకు కేటాయించిన విషయం తెలిసిందే. మరో వైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము పోటీకి రెడీ అని నిన్న జనసేన పార్టీ ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతామని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. జనసైనికులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.