హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈరోజు పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హిమాయత్ నగర్‌లోని ఆదర్శ్ బస్తీలో ముంపుకు గురైన ప్రాంతాన్ని.. అదే విధంగా నల్లకుంట పద్మ నగర్, నాగయ్య కుంట, అడిక్ మెట్ ప్రాంతాలతో పాటు.. నాలా పనులను ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠా గోపాల్ తో కలిసి పరిశీలించారు.
ముందుగా హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం.14 లోతట్టు ప్రాంతంలో గత రాత్రి నుండి కొన్ని గృహాలలోకి నాలా నీరు వస్తుండటంతో.. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో పాటు డీఆర్ఎఫ్ టీం ల సహాయంతో మోటర్ల ద్వారా నీటిని బయటకు పంపించారు. కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటుగా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, లేక్ సీఈ సురేష్ కుమార్, యస్ఈ ఆనంద్ తదితరులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నాలా పొంగటానికి గల కారణాలను కమిషనర్ అక్కడ ఉన్న లేక్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.