జీహెచ్‌ఎంసీ బడ్జెట్.. రూ.550 కోట్లు పెంపు
GHMC Budget increases by Rs 550 crore. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గత ఏడాదితో పోలిస్తే రూ.550 కోట్ల బడ్జెట్‌ను
By Medi Samrat Published on 16 March 2022 5:42 PM ISTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గత ఏడాదితో పోలిస్తే రూ.550 కోట్ల బడ్జెట్‌ను పెంచింది. 2021-22 బడ్జెట్ కేటాయింపులు రూ.5,600 కోట్లు కాగా, 2022-23 వార్షిక బడ్జెట్‌ను రూ.6,150 కోట్లకు పెంచారు. కార్పొరేషన్ ఈ ముసాయిదా వార్షిక బడ్జెట్ అంచనా రూ.6,150 కోట్లను బుధవారం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచగా.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు, కమిటీ సభ్యులు తెలిపారు. 2021-22 కోసం సవరించిన బడ్జెట్ అంచనా (RBE) 6,300 కోట్ల రూపాయలకు పెరిగింది. RBE ఆమోదం కోసం కమిటీ ముందు ఉంచబడుతుంది.
ముసాయిదా బడ్జెట్ ప్రకారం, తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ కింద 2 బిహెచ్‌కె ఇళ్ల నిర్మాణానికి కేటాయింపులు రూ. 1,241.33 కోట్లు తగ్గాయి. చాలా యూనిట్లు ఇప్పటికే నిర్మించబడ్డాయని అధికారులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని ఇటీవల మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. 2022-23లో ఇళ్ల నిర్మాణానికి రూ.406.70 కోట్లు కేటాయించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, పారిశుధ్యం, రహదారి మౌలిక సదుపాయాలు, నాలాల కోసం సింహభాగం కేటాయించారు. రూ.6,150 కోట్ల బడ్జెట్‌లో రోడ్ల మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, పచ్చదనం, డ్రైన్‌లు, పేవ్‌మెంట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు మూలధన వ్యయం రూ.3,350 కోట్లు కాగా, ఆదాయం రూ.3,434 కోట్లుగా ఉంది. 2022-23లో, GHMC ఆస్తి పన్ను ద్వారా రూ. 1,700 కోట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర ఆదాయ ఉత్పాదక కార్యకలాపాల ద్వారా రూ. 1,200 కోట్లు వసూలు చేయాలని భావిస్తోంది.