సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల క్రితం ఓ మహిళకు సినిమా చూపిస్తూ ఆమెను స్పృహలోనే ఉంచి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వైద్యులు ఆపరేషన్ చేసి.. ఆమె మెదడులోని కణతిని తొలగించారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి నటించిన 'అడవి దొంగ' సినిమా చూశారు. వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల మహిళా రోగి గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న వైద్యులు, క్రానియోటమీ అని పిలువబడే మెదడు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. మీరు టీవీలో ఏమి చూడాలనుకుంటున్నారు అని వైద్యులు రోగిని అడిగినప్పుడు, 60 ఏళ్ల వృద్ధురాలు తాను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానినని.. ఆయన సినిమాల్లో ఒకదాన్ని చూడటానికి ఇష్టపడతానని చెప్పింది. శస్త్ర చికిత్స సమయంలో పేషెంట్ 'అడవి దొంగ' సినిమా చూసి ఎంజాయ్ చేసిందని సర్జన్లు తెలిపారు. ప్రముఖ నటుడు చిరంజీవి డాక్టర్ లను ప్రశంసించారు. ఆమె అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె వివరాలు తెలుసుకోమంటూ తన పీఆర్వో ఆనంద్‌ను ఆసుపత్రికి పంపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును కలిశారు.
మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఆయన పరిచయం చేశారు. అనంతరం ఆనంద్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను కలిసి మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలను క్రమం తప్పకుండా చూస్తానని ఆమె చెప్పారు. అనంతరం ఆనంద్ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వీలు చూసుకుని రెండుమూడు రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆనంద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు చెప్పారు.