Hyderabad: వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్‌ బాలిక ఎలా తప్పించుకుందంటే?

భాగ్యనగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌ చూపిస్తామని మాయమాటలు చెప్పి ఓ బంగ్లాదేశ్ మైనర్ బాలికను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చింది ఓ మహిళ.

By అంజి
Published on : 9 Aug 2025 8:39 PM IST

Hyderabad: వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్‌ బాలిక ఎలా తప్పించుకుందంటే?

భాగ్యనగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌ చూపిస్తామని మాయమాటలు చెప్పి ఓ బంగ్లాదేశ్ మైనర్ బాలికను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చింది ఓ మహిళ. ఆ తర్వాత ఆమె బాలికను ఓ ముఠాకు అప్పజెప్పింది. వారు బాలికను వ్యభిచార కూపంలోకి నెట్టి, ఆరు నెలల పాటు అఘాయిత్యం చేశారు. చివరికి ఆ బాలిక ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి:

బంగ్లాదేశ్‌కు చెందిన ఆ బాలిక స్నేహితురాలు ఆమెను మోసం చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఇక్కడ మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షహనాజ్, హజీరా అనే ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్ సమీర్‌తో కలిసి ఆ బాలికను వ్యభిచారంలోకి దింపారు. గత ఆరు నెలలుగా హోటళ్లలో ఆమెను అక్రమ పనులకు బలవంతంగా ఉపయోగించుకున్నారు.

పోలీస్ స్టేషన్ బోర్డు చూసి రక్షణ కోరిన బాలిక

ఒక రోజు, ఆ బాలిక ఓ హోటల్ నుంచి వెళ్తున్నప్పుడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ బోర్డు చూసి ధైర్యంగా లోపలికి వెళ్లింది. తనకు జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది. వెంటనే స్పందించిన బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఐదుగురి అరెస్టు

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఆర్గనైజర్లు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలు, కోల్‌కతాకు చెందిన ఒక మహిళ ఉన్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు త్వరలోనే బయటపడతాయని పోలీసులు తెలిపారు.

"బాధితురాలిని రూప అనే మహిళ అక్రమ మార్గాల ద్వారా భారతదేశంలోకి తీసుకువచ్చింది. దేశంలోకి ప్రవేశించిన తర్వాత, వారు కోల్‌కతాకు చేరుకుని , ఆపై హైదరాబాద్‌కు వెళ్లి బండ్లగూడకు చేరుకున్నారు. బాధితురాలిని వ్యభిచార నిర్వాహకురాలైన ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన హజేరా బేగంకు అప్పగించారు" అని ఏసీపీ సుధాకర్ తెలిపారు.

హజేరా బేగం బాధితురాలిని బార్లలో డ్యాన్సర్‌గా పనిచేసే మరో అనుమానితురాలు షహనాజ్ ఫాతిమా (32) ఇంటికి తీసుకెళ్లి, కాంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ సమీర్ (23) అనే బ్రోకర్ సహాయంతో ఆమెను అక్కడే ఉంచింది.

"హజేరా, షహనాజ్, సమీర్ అనే వ్యక్తులు ఆ బాలికను బెదిరించి అరెస్టు చేయిస్తామంటూ వ్యభిచారంలోకి దింపారు. బాధితురాలు పోలీసులను సంప్రదించిన తర్వాత, మెహదీపట్నంలో దాడి నిర్వహించి , మరో ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలను రక్షించారు" అని ఏసీపీ తెలిపారు. బంగ్లాదేశ్ కు చెందిన అనేక మంది మహిళలను అక్రమంగా వ్యభిచారం కోసం భారతదేశంలోకి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూప , సర్వర్ లను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .

Next Story