ఆ రేస్.. 700 కోట్లు తీసుకుని వచ్చిందట

ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా E రేసుతో దాదాపు రూ.700 కోట్ల లబ్ధి హైదరాబాద్ నగరానికి చేకూరిందని ఒక నివేదిక తెలిపింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2023 7:45 PM IST
formula e-race, hyderabad, rs 700 cr economic,

ఆ రేస్.. 700 కోట్లు తీసుకుని వచ్చిందట 

భారతదేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా E మొట్టమొదటి రేసుతో దాదాపు రూ.700 కోట్ల లబ్ధి హైదరాబాద్ నగరానికి చేకూరిందని ఒక నివేదిక తెలిపింది. నీల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ నిర్వహించిన ఆర్థిక అధ్యయనం ప్రకారం.. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగిన ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ తొలి రేసు ఫలితంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు USD 83.7 మిలియన్ (సుమారు రూ. 693 కోట్లు) లబ్ధి జరిగిందని తేలింది.

31,000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ రేస్ ఈవెంట్‌కు హాజరయ్యారు. మెజారిటీ (59 శాతం) హైదరాబాద్ వెలుపల నుండి రావడం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడింది. ఇక 150 దేశాలకు చెందిన ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందిన ‘మోటర్స్‌ పోర్ట్‌ ఈవెంట్‌’తో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడమే కాకుండా నగర ఆర్థికాభివృద్ధిపై గణనీయ ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో 2024లో కూడా ఫార్ములా-ఈ రేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌కో సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఫార్ములా E ఏకైక డబుల్ ఛాంపియన్ జీన్-రిక్ వెర్గ్నే ఈ రేసును గెలుచుకున్నాడు. అయితే, వచ్చే ఏడాదికి సంబంధించిన రేసింగ్ క్యాలెండర్‌లో హైదరాబాద్ భాగం కాదు. ఫార్ములా ఇతో పాటు స్థానిక ప్రమోటర్లు తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్కో 2024లో రేసును తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

భారతదేశంలో జరిగిన మొదటి ఫార్ములా E రేస్ హైదరాబాద్, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ కు అభిమానులు ఉండడంతో.. ముఖ్యంగా వీక్షకులకు థ్రిల్లింగ్ వినోదాన్ని అందించింది. "ఫార్ములా E లో ఉన్న నా బృందం తదుపరి సీజన్‌లో తిరిగి రావడానికి.. అద్భుతమైన ఈవెంట్‌ను అందించడం కోసం చాలా కష్టపడి పనిచేస్తోంది. హైదరాబాద్ కు రావడానికి కూడా మేము ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాం. 2024లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండో విడత ఈవెంట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము" అని ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story