హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత కలకలం సృష్టించింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి ఓ చిరుత పులి లోపలికి వచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకింది. అయితే చిరుతతో పాటు దాన్ని రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా చిరుత ఫెన్సింగ్ వైర్లకు తగిలింది. అది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కావడంతో.. చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది .అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు తేలింది.
చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు వెంటనే అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్‌లోకి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే చిరుతను బంధించేందుకు బోన్ లు ఏర్పాటు చేశారు. చిరుత కదలికలపై దృష్టి పెట్టేందుకు డ్రోన్ కెమెరాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.