రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని విస్టా సిటీ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్థులోని 521 ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన అపార్టుమెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలిబూడిదమైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటినట్లు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ క్లబ్‌లో ఈ రోజు వేకుకజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. క్లబ్‌లోని ప్రధాన భవనం అగ్నికి అహుతైంది. క్లబ్‌లో చెలరేగిన మంటలను సుమారు 10 ఫైరింజన్‌ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.