హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బహదూర్‌పురలో వరుసగా గోదాములో మంటలు చెలరేగాయి. వాహన విడిభాగాలు, బొగ్గు, మరో రెండు గోదాములు ఒకదానిపక్కన ఒకటి అనుకొని ఉన్నాయి. బొగ్గుకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. అర్థరాత్రి కావడం.. గోదాముల వెనుకభాగం కావడంతో..పెద్ద ఎత్తున మంటలు చెలరేగేవరకు ఎవరూ గమనించలేదు. స్థానికులు మంటలను గమనించే సరికి గోదాములు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకున్నాయి.
భారీ అగ్నిప్రమాదం కావడంతో ఆప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రధాన రహదారి పక్కన గోదాములు ఉండటంతో వాహనాలు నిలిచిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్ తరుణ్ జోషి, హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికి.. సుమారు రూ.50లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు గోదాముల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.