హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున వీఎస్టీ సమీపంలోని ఓ గోదాములో మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు వినియోగించే డెకరేషన్ సామాగ్రి ఉంది. క్షణాల్లోనే మంటలు వాటికి అంటుకుని ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ గోదాముకు సమీపంలో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు బావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మంటలు పక్కనే ఉన్న మరో గోదాంకు వ్యాపించాయి. కేబుల్ వైర్స్, ప్లాస్టిక్ మెటీరియల్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.