హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తీలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. భారీగా మంటలు రావడంతో అవి క్రమంగా ఫ్యాక్టరీ మొత్తానికి విస్తరించాయని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో కాటన్ వేస్ట్ భారీగా ఉందని, ఈ క్రమంలోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయని తెలుస్తోంది.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించారు. దాదాపు రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. పరిశ్రమలో మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాల నుండి భయంతో పరుగులు తీశారు. కాగా ప్రమాదం సంభవించడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు భావిస్తున్నారు.