Hyderabad: బర్గర్‌ షాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 27 Aug 2023 3:27 PM IST

Fire Accident, Hyderabad, Jubilee Hills,

Hyderabad: బర్గర్‌ షాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బిగిస్ బర్గర్‌ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో ఆ షాపులో ఉన్న సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదు. దాంతో వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కూడా త్వరగా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

కాగా.. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న బర్గర్‌ షాపు పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉంది. మంటలు ఎక్కడ అక్కడి వరకు వ్యాపిస్తాయో అని స్థానికులు భయపడిపోయారు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు చెలరేగుతున్న క్రమంలో పోలీసులు సిబ్బంది పెట్రోల్‌ బంక్‌ను మూసివేయించారు. ఫైర్‌ సిబ్బంది మంటలు పక్కకు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 36లో బిగిస్ బర్గర్‌ షాపులో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారి ఎంఏ ఫాజల్ తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని.. కొంత ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి చెప్పారు. అయితే.. బిగిస్‌ బర్గర్‌ షాపులో అగ్నిమాపక నిబంధనలు పాటించలేదని ఫైర్ ఆఫీసర్ వివరించారు. ఓనర్‌పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Next Story