Hyderabad: ఫేక్ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆటకట్టించిన పోలీసులు

మ్యాట్రిమోనీ ద్వారా ఓ మోసగాన్ని పెళ్లి చేసుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ ఐఏఎస్, నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేశారు.

By అంజి  Published on  11 July 2024 8:45 AM GMT
Fake IAS Officer, arrest, Hyderabad

Hyderabad: ఫేక్ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆటకట్టించిన పోలీసులు

హైదరాబాద్‌: మ్యాట్రిమోనీ ద్వారా ఓ మోసగాన్ని పెళ్లి చేసుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ ఐఏఎస్, నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్‌లో తాను ఐఏఎస్ అని నమ్మించాడు. అది నిజమని నమ్మిన ఓ బాధితురాలు అతన్ని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న ఆరు సంవత్సరాల తర్వాత అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. అంతే కాదండోయ్ ఈ మోసగాడు వివిధ కారణాలు చెప్పి ఏకంగా భార్య దగ్గర నుండి రెండు కోట్ల వసూలు చేశాడు. చివరకు పోలీసులు చేతికి చిక్కి ఊచలు లెక్కబడుతున్నాడు.

ఖమ్మం జిల్లా ఏన్కూర మండలం రాజలింగాల గ్రామానికి చెందిన నల్ల పోతు విజయకుమార్ కుమారుడు నల్ల పోతు సందీప్ కుమార్ కుటుంబం మల్లంపేట గ్రీన్ వ్యాలీ రోడ్డులోని శ్రీ సాయి రెసిడెన్సిలో నివాసం ఉంటున్నారు. సందీప్ కుమార్ 2016లో ఐఏఎస్ గా సెలెక్ట్ అయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి వివాహం కోసం మ్యాట్రిమోనీలో పెట్టాడు. అది నిజమని నమ్మిన నిజాంపేట భవ్యాస్ ఆనందం ఎదురుగా ఉన్న శ్రీ నిలయ రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో ఉంటున్న కర్నూలు జిల్లా ఆదోని మండలం కుర్మాంపేట్ గ్రామానికి చెందిన అరవిల్లి శ్రావణి(34) కుటుంబ సభ్యులు భారీగా కట్నం ఇచ్చి 2018లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

2016 బ్యాచ్ కర్ణాటక కేడర్ కు చెందిన ఐఏఎస్ గా చలామణి అయ్యాడు సందీప్‌ కుమార్‌. దీంతో బాధితురాలు తన భర్త ఐఏఎస్ ఆఫీసర్ అని పూర్తిగా నమ్మింది. అంతలోనే సందీప్ తనకు ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యను నమ్మించాడు. అంతటితో ఆగలేదండోయ్ ఈ ఘనుడు. వైద్యం ద్వారా రూ.40 కోట్లు వచ్చాయని, ఐటీ అధికారులు తన ఖాతా ఫ్రీజ్ చేశారని సందీప్ తన భార్యకు కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే తన బ్యాంక్ ఖాతా రిలీజ్ కావాలంటే రూ.రెండు కోట్ల చెల్లించాలని భార్య దగ్గర డబ్బులు తీసుకునేందుకు డ్రామా ఆడాడు. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర నుండి ఈ నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే ఈ రెండు కోట్ల రూపాయలను సందీప్ కుమార్ తన తల్లిదండ్రులు బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తన బంగారాన్ని అంతా అమ్మిన డబ్బులతో భర్త చెడు వ్యసనాలకు బానిసై ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి డబ్బులు అన్ని నష్టపోయి నట్లుగా తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత భర్త సందీప్ అసలు బాగోతం బయటపడింది.

కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు ప్రకారం..

''బాచుపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తి తాను ఐఏఎస్, డాక్టర్ అని చెప్పుకుని భార్యను మోసం చేశాడు. తాను ఐఏఎస్ ను అంటూ మ్యాట్రిమొనీ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న ఖమ్మం జిల్లా కు చెందిన నల్లమోతు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నాం. తాను సివిల్స్ పాసై.. ఐఏఎస్ అయ్యానని ఊర్లో వాళ్ళను నమ్మించాడు'' అని తెలిపాడు. ఇదంతా నమ్మి.. సందీప్‌ను కర్నూలు జిల్లా అవనిగడ్డకు చెందిన శ్రావణి పెళ్లి చేసుకుంది. తాను సీక్రెట్ మిషన్‌లో ఉన్నానని.. అందుకే ప్రభుత్వ వాహనం, ప్రోటోకాల్ ఏం ఉండవని భార్య, అత్తారింటి వాళ్ళను నమ్మించాడు. కేవలం తండ్రి కోసమే సివిల్స్ ప్రిపేర్ అయ్యానని.. తాను రేడియాలజీ లో ఎండీ చేశానని మరో మోసం చేశాడు సందీప్. తాజాగా భర్త మోసాలు బయటపడటంతో భార్య శ్రావణి వెంటనే బాచూపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. సందీప్ తోపాటు.. సందీప్ చెల్లి, పేరెంట్స్ పై 291, 498, 406, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏసిపి శ్రీనివాసరావు వెల్లడించారు.

Next Story