హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నౌహెరా షేక్‌కు ఈడీ షాక్
హీరా గ్రూప్ అధినేత్రి నౌహెరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది.
By - Knakam Karthik |
హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నౌహెరా షేక్‌కు ఈడీ షాక్
హీరా గ్రూప్ అధినేత్రి నౌహెరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్ జోనల్ కార్యాలయం, నిందితురాలు నౌహెరా షేక్‌కు చెందిన అటాచ్ చేసిన ఒక స్థిరాస్తిని రూ. 19.64 కోట్లకు విజయవంతంగా వేలం వేసింది. నవంబర్ 21, 2025న ఆ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను సబ్—రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16.08.2019న తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది.
కాగా రూ.5,978 కోట్ల మోసం కేసులో దేశవ్యాప్తంగా నౌహెరా షేక్ & ఇతరులపై టెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల పోలీసు శాఖలు నమోదు చేసిన అనేక FIRల ఆధారంగా ఈడీ మని లాండరింగ్ నిరోధక చట్టం (PMLA – 2002) కింద దర్యాప్తు చేపట్టింది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నిర్లక్ష్యంగా నమ్మిన ప్రజల నుంచి నౌహెరా షేక్ & ఇతరులు రూ. 5,978 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించారు. సంవత్సరానికి 36% కంటే ఎక్కువ లాభం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వారికి మూలధనం కూడా తిరిగి ఇవ్వకుండా భారీ మోసం చేశారు. దీంతో రూ. 428 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది.
ఈడీ దర్యాప్తులో నిందితురాలు నౌహెరా షేక్, తన పేరుతో, తన కంపెనీల పేర్లతో, బంధువుల పేర్లతో అనేక స్థిరాస్థులను నేరంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు ₹428 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేసి, ప్రధాన అభియోగ పత్రం, అదనపు అభియోగ పత్రం, ప్రత్యేక PMLA కోర్టుకు సమర్పించబడింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వేలంపాట నిర్వహించగా ఇప్పటివరకు రూ.93.63 కోట్లు రాబడి వచ్చింది. ఈ కేసులో కొనసాగుతున్న విచారణలో భాగంగా, బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలని ఈడీ సుప్రీం కోర్టులో విజ్ఞప్తి చేసింది. అనుమతి లభించడంతో MSTC ద్వారా పలు ఆస్తులను వేలం వేశారు.
వేలంపాట ద్వారా వచ్చే మొత్తం మొత్తాన్ని మోసపోయిన బాధితులకు/పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చేందుకు వినియోగించనున్నారు. రూ.19.64 కోట్లు విలువైన ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తిచేయడం ద్వారా ఆ ఆస్తికి సంబంధించిన వేలం ప్రక్రియ ముగిసింది.ఈ వసూళ్లు త్వరలోనే బాధితులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియకు మార్గం సుగమం చేయనున్నాయి.