శనివారం రాత్రి నిజాంపేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఏఎస్ఐ, హోంగార్డును రెండు కార్లు ఢీ కొట్టాయి. ఈ ఘటనల్లో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల నుంచి సృజన్ అనే వ్యక్తి తప్పించుకునేందు యత్నించాడు. తన కారును వేగంగా వెనక్కి పోనివ్వడంతో మరో కారును ఢీకొట్టాడు. వెంటనే కారును ముందుకు పోనిచ్చి అక్కడే ఉన్న హోంగార్డును ఢీ కొట్టాడు. దీంతో హోంగార్డుకు గాయాలయ్యాయి. వెంటనే సృజన్ ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా 170 రీడింగ్ వచ్చింది. సృజన్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు.
ఇక హోంగార్డుకు గాయాలయ్యాయి అని తెలిసిన ఏఎస్ఐ మైపాల్ రెడ్డి అక్కడకు వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తుండగా.. అస్లాం అనే వ్యక్తి కారులో వచ్చి ఏఎస్ఐని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో మైపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన సృజన్, అస్లాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.