ఓ యువకుడు జన్యుపరమైన కారణాల వల్ల తన వృషణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడు తన వైవాహిక జీవితం గురించి ఆందోళన చెందాడు. దీనికి పరిష్కారం కనుక్కోవాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రందించాడు. దీంతో ఆ యువకుడికి వైద్యులు ఆపరేషన్ చేసి కృత్రిమ వృషణాన్ని అమర్చారు. వివరాల్లోకి వెళ్తే.. సుమారు 4 సంవత్సరాల కిందట ఓ యువకుడు తన వృషణాల్లో తీవ్రమైన నొప్పి వస్తోందంటూ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు.. ఎడమవైపు వృషణం మెలితిరిగిపోయిందని, రక్తస్రావం పూర్తిగా నిలిచిపోయి మృతస్థితికి వచ్చిందని నిర్దారించారు. అయితే దాన్ని అలాగే వదిలేస్తే.. కుడివైపు ఉన్న వృషణానికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించి, దెబ్బతిన్న వృషణాన్ని తీసేశారు.
సంవత్సరం తర్వాత మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పారు. అయితే కోవిడ్ కారణంగా సదరు యువకుడు ఆస్పత్రికి రాలేకపోయాడు. ప్రస్తుతం అతడి వయస్సు 23 ఏళ్లు. కాగా ఓ వృషణం లేకపోవడంతో వైవాహిక జీవితంపై ఆందోళన చెందుతూ ఆస్పత్రికి వచ్చాడు. దీంతో అతడికి సిలికాన్‌తో చేసిన కృత్రిమ వృషణాన్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. అయితే ఇది సాధారణ వృషణం చేసే పనులు చేయకపోయినా.. రెండు ఉన్నట్లు కనిపిస్తుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సిలికాన్‌తో చేసిన కృత్రిమ వృషణాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా రావని తెలిపారు.