3 నెల‌ల బాలుడికి అరుదైన వృష‌ణాల స‌మ‌స్య‌.. విజ‌య‌వంతంగా చికిత్స చేసిన ఏఐఎన్‌యూ వైద్యులు

Doctors at Hyderabad's AINU treat rare testis disorder. టెస్టిక్యుల‌ర్ టోర్ష‌న్ అనే అరుదైన వృష‌ణాల స‌మ‌స్య ఉన్న మూడు నెల‌ల బాబుకు తాము

By అంజి  Published on  11 Dec 2022 1:00 PM GMT
3 నెల‌ల బాలుడికి అరుదైన వృష‌ణాల స‌మ‌స్య‌.. విజ‌య‌వంతంగా చికిత్స చేసిన ఏఐఎన్‌యూ వైద్యులు

చిన్న కాస్మొటిక్ స‌వ‌ర‌ణ‌ల‌తో చిన్నారికి ఇక సాధార‌ణ జీవితం

వృష‌ణాల‌తో పాటు చిన్నారి ప్రాణాల‌ను కాపాడేందుకు త‌క్ష‌ణ శ‌స్త్రచికిత్స అవ‌స‌ర‌మైన అరుదైన ప‌రిస్థితి

హైద‌రాబాద్‌: టెస్టిక్యుల‌ర్ టోర్ష‌న్ అనే అరుదైన వృష‌ణాల స‌మ‌స్య ఉన్న మూడు నెల‌ల బాబుకు తాము విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేసిన‌ట్లు ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు తెలిపారు. అప్ప‌టికే పాడైన వృష‌ణాన్ని తొల‌గించ‌డంతో పాటు రెండోదాన్ని స‌రైన ప్రాంతంలో పెట్ట‌డానికి ఆ బాబుకు త‌క్ష‌ణం ఒక శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది.ఇప్పుడు ఆ బాబుకు ఒక‌టే వృష‌ణం ఉన్నా, త‌ర్వాతి కాలంలో సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌ప‌గ‌ల‌డు.

ఎడ‌మ‌వైపు మ‌ర్మాంగాల‌ను ముట్టుకుంటే వెంట‌నే ఆ బాబు ఏడుస్తుండ‌టంతో త‌ల్లిదండ్రులు వైద్య ప‌రీక్ష‌ల కోసం అత‌డిని ఏఐఎన్‌యూకు తీసుకొచ్చారు. వృష‌ణానికి ర‌క్త‌స‌ర‌ఫ‌రా అవుతున్న‌ప్పుడు అది మెలితిరిగి ఉన్న‌ట్లు గ‌మ‌నించి, దీన్నే టెస్టిక్యుల‌ర్ టార్ష‌న్ అంటార‌ని ఏఐఎన్‌యూ వైద్యులు గుర్తించారు. ఈ ప‌రిస్థితి సాధార‌ణంగా శిశువుల‌తో పాటు కొంత‌మంది పెద్ద‌వాళ్ల‌లోనూ త‌క్కువ‌గానే క‌నిపిస్తుంది. ఇది వైద్య‌ప‌రంగా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కింద‌కు వ‌స్తుంది. ఇందులో వెంటనే చికిత్స లేదా శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి.

ఈ కేసు గురించి ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీలోని క‌న్స‌ల్టెంట్ పీడియాట్రిక్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌భు క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ.. ''అండ‌కోశంలో ఉండే వృష‌ణాల చుట్టూ ఉండే క‌ణ‌జాలం వ‌దులుగా అయిపోతుంది. దీనివ‌ల్ల వృష‌ణాలు అండ‌కోశంలో సాధార‌ణ ప‌రిస్థితిలో క‌ద‌ల‌వు. కొన్నిసార్లు ఇలా వ‌దులుగా ఉండే వృష‌ణాలు త‌న సొంత క‌క్ష్య‌ను దాటి తిర‌గ‌డంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఆగిపోతుంది. ఇలా ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఆగిపోతే వృష‌ణాలు పాడ‌వుతాయి. ఈ కేసులో మేం ఎడ‌మ‌వైపు వృష‌ణాన్ని తొల‌గించాల్సి వ‌చ్చింది. రెండోదాన్ని వెంటనే స‌రిచేశాం. అలా చేయ‌క‌పోతే రెండో వృష‌ణం కూడా అదే ప‌రిస్థితిలోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అలాగైతే ఇక ఆ బాబుకు ఇక వృష‌ణాలే ఉండ‌వు. ఇప్పుడు రెండో వృష‌ణాన్ని స‌రిచేయ‌డంతో అది సుర‌క్షితంగా ఉన్న‌ట్ల‌యింది'' అని వివ‌రించారు.

''ఇలా టార్ష‌న్ టెస్టిస్ వ‌చ్చిన‌ప్పుడు వృష‌ణాల స‌మీపంలో గానీ, క‌డుపు కిందిభాగంలో గానీ తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. పెద్ద‌వాళ్ల‌లో అయితే ఆట‌లు ఆడేట‌ప్పుడు లేదా, ఏదైనా వ్యాయామం లాంటివి చేసేట‌ప్పుడు ఇలాంటి నొప్పి రావ‌చ్చు. పిల్ల‌ల‌కు మ‌ర్మావ‌య‌వాల్లో ఇలాంటి నొప్పి వ‌చ్చిందంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. నొప్పి మొద‌లైన 6 గంట‌ల్లోగా వైద్యుల వ‌ద్ద‌కు తీసుకెళ్తే వృష‌ణాన్ని కాపాడ‌వ‌చ్చు. ఇలాంటి ల‌క్ష‌ణాల‌కు వేరే ఏవైనా స‌మ‌స్య‌లు కూడా ఉండొచ్చు గానీ, ఆ విష‌యాన్ని వైద్యులే నిర్ణ‌యించి, టార్ష‌న్ లేద‌ని తేల్చాలి'' అని డాక్ట‌ర్ ప్ర‌భు క‌రుణాక‌ర‌న్ చెప్పారు.

ఈ బాబుకు ఇప్పుడు ఒక‌టే వృష‌ణం ఉన్నా, పెద్ద‌యిన త‌ర్వాత ఎలాంటి దుష్ప్ర‌భావాలూ ఉండ‌క‌పోవ‌చ్చు అయితే, పెద్ద‌యిన త‌ర్వాత చూడ‌టానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు టెస్టిక్యుల‌ర్ ఇంప్లాంట్లు పెడ‌తారు. అది సుర‌క్షిత‌మైన వైద్య‌విధానం. ఈ ర‌క‌మైన స‌మ‌స్య చిన్న పిల్ల‌ల్లో చాలా అరుదుగా క‌నిపిస్తుంది, ల‌క్ష మందిలో ఒక‌రికి మాత్రమే ఇలాంటిది వ‌స్తుంది.

ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ గురించి:

యూరాల‌జీ, నెఫ్‌రాల‌జీ కేసుల‌కు సంబంధించి ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) అనేది 'సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'. భార‌త‌దేశంలో మూత్ర‌పిండాల ఆస్ప‌త్రుల‌లో ఇది అతిపెద్ద గ్రూపు. యూరాల‌జీ, నెఫ్రాల‌జీ చికిత్స‌ల‌లో ఏఐఎన్‌యూ స‌మ‌గ్ర వైద్య‌సేవ‌లు అంది'స్తోంది. అనుభ‌వ‌జ్ఞులైన వైద్యులు, న‌ర్సులు, పారామెడిక‌ల్ టెక్నీషియ‌న్లు ఉండటంతో చికిత్స‌ల‌లో ప్ర‌తి స్థాయిలోనూ అద్భుత‌మైన సేవ‌లు అందుతాయి. హైద‌రాబాద్, సికింద్రాబాద్, విశాఖ‌ప‌ట్నం, సిలిగురి, చెన్నై న‌గ‌రాల్లో ఈ ఆస్ప‌త్రి శాఖ‌లు ఉన్నాయి.

Next Story