హైదరాబాద్ లో బాద్షా ఈవెంట్.. పాముల వదంతులు.. ఊహించని వర్షం
DJ Waley Babu interrupted Badshah’s concert at Gachibowli cut short due to sudden downpour. ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్షా హైదరాబాద్ కాన్సర్ట్ అనుకున్న విధంగా సాగలేదు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jun 2023 9:15 PM ISTహైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్షా హైదరాబాద్ కాన్సర్ట్ అనుకున్న విధంగా సాగలేదు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ‘రైడ్ విత్ బాద్షా’ అనే లైవ్ కాన్సర్ట్ లో ప్రముఖ రాపర్ బాద్షా అందరినీ అలరించడానికి వచ్చాడు. అయితే భారీ వర్షం కారణంగా లైవ్ కాన్సర్ట్ కాస్తా సగంలో ఆపేయాల్సి వచ్చింది. దీంతో ఈవెంట్ కు వచ్చిన వేలాది మంది అభిమానులు నిరుత్సాహపడ్డారు. బాద్‌షా తన సూపర్ హిట్ సాంగ్స్ తో దుమ్ము దులిపాడు. సాటర్డే.. సాటర్డే వంటి డ్యాన్స్ హిట్స్ తో పాటూ.. DJ వాలే బాబు.. వంటి పాటలతో అలరించాడు. బాద్షా హిట్ సింగిల్స్ రాప్ సాంగ్స్ తో సూపర్ ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చాడు. 'కాలా చష్మా', 'కర్ గయీ చుల్' వంటి భారీ హిట్‌లతో బాలీవుడ్‌లో బాద్షా తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. సంగీత ప్రియుల హృదయాలలో అతడు స్థానం సంపాదించుకున్నాడు. అతడి ఈవెంట్ అంటే చాలు పలు నగరాల్లో అభిమానులు పోటెత్తుతూ ఉంటారు. అలాగే హైదరాబాద్ లో కూడా అతడి ఈవెంట్ కు బాగా ఫ్యాన్స్ వచ్చారు.
అనుకోకుండా కురిసిన వర్షం కారణంగా అభిమానులు అనుకున్నంత ఎంజాయ్మెంట్ దక్కలేదు. మేఘాలు కమ్ముకోవడంతో సంతోషకరమైన వాతావరణం త్వరగా నిరుత్సాహంగా మారింది. భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అభిమానులను నిరాశపరిచింది. ఊహించని పరిణామంతో బాద్‌షా లైవ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లింది. వర్షం కారణంగా వేదికకు కొంత నష్టం వాటిల్లడంతో కార్యక్రమం కాస్తా అస్తవ్యస్తంగా మారింది. బాద్షా ఇంస్టాగ్రామ్ ఫీడ్ ప్రకారం 15,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, అయితే 3,000 నుండి 4,000 మంది అభిమానులు మాత్రమే అక్కడకు వచ్చారు.
ఇంత గందరగోళం మధ్య, ఈవెంట్ జరిగిన ప్రదేశంలో మూడు పాములు ఉన్నట్లు పుకారు వ్యాపించింది. ఈవెంట్‌లో భాగమైన షోకేస్ హౌస్ ప్రొడక్షన్ మేనేజర్ పవన్ సాయి మాత్రం ఖండించారు, “పెద్ద శబ్దం, ప్రకాశవంతమైన లైట్లు ఉన్న ప్రాంతానికి పాములు ఎలా వస్తాయి? ఇది కేవలం పుకారు మాత్రమే. ” అని అన్నారు. బౌల్డర్ హిల్స్ పూర్తిగా జనంతో నిండిపోయిందని.. ఇది ఒక హిట్ ఈవెంట్ అని అతడు చెప్పుకొచ్చాడు.
ఈవెంట్ కు హాజరైన S మధు అనే వ్యక్తి తన నిరాశను వ్యక్తం చేస్తూ.. “వర్షం మొదలయ్యే వరకు బాగానే ఉంది. కానీ వర్షం వచ్చినప్పుడు తలదాచుకోడానికి ఎటువంటి ప్రాంతం లేకపోవడంతో.. ఈవెంట్ కు హాజరైనవారు తడిసిపోయారు. భారీ వర్షం నిజంగా అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బతీసింది. వర్షం అంతరాయం కలిగించక ముందు బాద్షా ప్రేక్షకులను అలరించినప్పటికీ.. ప్రదర్శనను అనుకున్న సమయం కంటే ముందే ముగించేయాల్సి వచ్చింది" అని చెప్పారు. చాలా మంది నిరుత్సాహంగా ఇళ్లకు వెళ్లిపోయారు.