వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్ నేటితో ముగియనుంది. వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్ల క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ మార్చి 31తోనే ముగియాల్సి ఉండగా .. వాహనదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు నేటితో ముగియనుంది. దీంతో వాహనదారులు పెండింగ్ చలాన్స్ ఉంటే త్వరపడాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మరోసారి పొడిగించేది లేదని స్పష్టం చేశారు. గడువు దాటితే.. ఎలాంటి డిస్కౌంట్ ఉండదని మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
టూ వీలర్, త్రీ వీలర్ కు 75శాతం, ఆర్టీసీ డ్రైవర్స్ 70శాతం, లైట్ మోటార్ వెహికిల్స్, హెవీ మోటర్ వెహికల్స్ కు 50శాతం, తోపుడు బండ్ల వ్యాపారులపై 80శాతం, నో మాస్క్ కేసులపై 90శాతం డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని వాహనదారులు బాగానే స్వదినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్ల రూపాయల పెండింగ్ చలాన్ లు క్లియర్ అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60శాతం మోటారు వాహన యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఒక వేళ మీరు ఇంకా పెండింగ్ చలాన్లను కట్టనట్లయితే వెంటనే చెల్లించేయండి. ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఆఫర్ ఉండనుంది. లేకుంటే రేపటి నుంచి మొత్తం కట్టాల్సిందే.