రేపే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో 'డీజీయాత్ర' ప్రారంభం
'Digi Yatra' will start at Hyderabad Airport tomorrow. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 17 Aug 2022 2:48 PM ISTహైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈనెల 18 నుంచి 'డిజియాత్ర' సేవలను ప్రారంభించనున్నారు. కాగిత రహిత సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా 3 నెలల పాటు ఈ సేవలను అందించనున్నారు. కాగిత రహిత టికెట్, వివిధ ద్వారాల వద్ద చెక్ పాయింట్లు వద్ద ఆటోమెటిక్‌గా ఎంట్రీ లభించేల ఏర్పాట్లు చేశారు. ముఖాన్ని గుర్తించే సిస్టంతో పలు గేట్ల వద్ద ఎంట్రీ విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. డిజియాత్ర యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవడమే.
డిజియాత్ర ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికుల జర్నీకి సంబంధించి ప్రాసెసింగ్ చేస్తారు. దీని వల్ల ఎయిర్‌పోర్టులో ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. తనిఖీలు ఎక్కువ లేకుండా సమయాన్ని ఆదా చేస్తుంది. డిజియాత్ర యాప్ ఉంటే.. ఎయిర్‌పోర్టులోని చెక్‌పోస్టుల వద్ద టిక్కెట్లు/బోర్డింగ్ పాస్‌లు, గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు. డిజియాత్ర యాప్‌కు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం వల్ల ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడంతో పాటు, పలు తనిఖీలు కూడా ఈజీగా జరిగిపోతాయి. ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ కూడా ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది.
ప్రయాణికులు డిజీయాత్ర మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేయాలి. ప్రయాణికుల నమోదిత మొబైల్ లేదా ఇమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. అది యాప్‌లో నమోదు చేసిన తర్వాత డీజీయాత్ర యాప్ ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ డేటాబేస్ నుంచి ఈ-కేవైసీ డేటాను తీసుకుంటుంది. పాస్‌పోర్ట్ మొదటి పేజీని స్కాన్ చేసిన తర్వాత డిజియాత్ర యాప్.. ఆధార్ ఇ-కెవైసి/డీఎల్ డేటా/ఇ-పాస్‌పోర్ట్ నుండి రిఫరెన్స్ ఫేస్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్ క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌తో స్కాన్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత విమానాశ్రయంలోకి ప్రవేశించాలి.
ఆ తర్వాత ఈ-గేట్ వద్ద తమ బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేయాలి. అక్కడ ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాను చూడటం ద్వారా మీ సమాచారం అంతా చెక్ అయిపోతుంది. ఇతర చెక్‌పోస్టుల్లోకి ప్రవేశించేందుకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. అయితే 'డిజియాత్ర' యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. డిజిటల్ విధానాన్ని ఉపయోగించి విమానాశ్రయంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వ్యక్తుల ద్వారా చెకింగ్స్ చేసే ప్రదేశాలు ఉండవు. రద్దీ తగ్గే అవకాశం ఉంది.