ఆ కేసులో జీఎస్టీ అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సీబీఐ సాయం కోరుతూ పంజాగుట్ట పోలీసుల లేఖ
Detaining Hyderabad Businessmans wife 5 top GST Officers in trouble panjagutta police seek cbis help. 2019లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త భార్యను
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2022 9:27 AM GMT2019లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు జీఎస్టీ ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూ ఉంది. చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి బాధితురాలు జె.రాఘవిరెడ్డిని 24 గంటల పాటు నిర్బంధించారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నగర పోలీసులు అధికారులపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం సహాయం కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైదరాబాద్‌కు లేఖ రాశారు. రైడ్ సంఘటనల క్రమాన్ని వివరించే కాపీలను భద్రపరచడానికి పోలీసులు హైదరాబాద్‌లోని జిఎస్‌టి కార్యాలయాన్ని కూడా సందర్శించినట్లు సంబంధిత వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి. బుక్ అయిన వారిలో జీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్- చెన్నై, ఆనంద్ కుమార్, జీఎస్టీ కమిషనర్-కచ్, బొల్లినేని శ్రీనివాస గాంధీ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (సస్పెన్షన్లో ఉన్నారు), చిలక సుధా రాణి, డిప్యూటీ కమిషనర్ జీఎస్టీ (సస్పెన్షన్లో ఉన్నారు), ఇసాబెల్లా బ్రిట్టో(GST సూపరింటెండెంట్) ఉన్నారు. సదరు ఐదుగురు అధికారులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 341, 506 కింద కేసు నమోదు చేశారు.
పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్‌కు చెందిన భరణి కమోడిటీస్ యజమాని సత్య శ్రీధర్ రెడ్డి జగన్నగారిపై ఎగవేత నిరోధక విభాగంలో పనిచేస్తున్న GST అధికారులు రైడ్స్ నిర్వహించిన సంఘటన 2019 నాటిది. ఈ కేసులో యజమానిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, ఇది ఒక వ్యక్తి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లని అతని భార్య ఆరోపించింది.
ఫిర్యాదుదారు జె రాఘవి రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 2019 సాయంత్రం 5.30 గంటలకు తన భర్త శ్రీధర్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు, బంజారాహిల్స్‌లోని తన ఇంట్లోకి ఐదుగురు వ్యక్తులు జిఎస్‌టి అధికారులమని చెప్పుకుంటూ చొరబడ్డారు. "దూకుడుగా ప్రవర్తిస్తూ, భయపెట్టడం మొదలుపెట్టారు. ఐదుగురు అధికారులు మాపై బలవంతంగా ప్రయోగించారు. అధికారుల్లో ఒకరైన ఇసాబెల్లా బ్రిట్టో, తాము ఏమైనా చేయగలమని, ఎవరూ ప్రశ్నించలేరు లేదా అడ్డుకోలేరని బెదిరించారు. సెర్చ్ వారెంట్ లేకుండా, వారు మా ఇంటిపై దాడులు చేశారు. ఆస్తులకు నష్టం వాటిల్లింది'' అని పోలీసులకు చెప్పారు. "ఏమీ దొరక్కపోవడంతో, వారు నన్ను బలవంతంగా బషీర్‌బాగ్‌లోని వారి జిఎస్‌టి కార్యాలయానికి తీసుకెళ్లి తెల్లవారుజామున 4.00 గంటల వరకు నిర్బంధించారు. సుమారు 1.30 గంటలకు, ఇద్దరు అధికారులు గదిలోకి ప్రవేశించి, తమను తాము ఎగవేత నిరోధక విభాగం (Anti evasion wing) నుండి బొల్లెనేని శ్రీనివాస గాంధీ, చిలక సుధా రాణి అని పరిచయం చేసుకున్నారు. నా భర్త (శ్రీధర్ రెడ్డి) ప్రశాంతంగా జీవించాలంటే మేం రూ. 5 కోట్లు లంచం ఇవ్వాలని నన్ను బెదిరించడం మొదలుపెట్టారు." అని ఆమె చెప్పుకొచ్చారు.
"అతను (బొల్లెనేని శ్రీనివాస గాంధీ) GPAని చించి విసిరేశాడు. వారు నన్ను తెల్లవారుజామున 4.00 AM వరకు అక్రమంగా నిర్బంధించారు. నా భర్త వారికి రూ. 5 కోట్ల లంచం చెల్లించాలనే ఆదేశాలతో ఫిబ్రవరి 28, 2019 ఉదయం 4 గంటల తర్వాత GST బషీర్‌బాగ్ కార్యాలయం నుండి వెళ్ళడానికి నన్ను అనుమతించారు. ఫిబ్రవరి 28, 2019 మధ్యాహ్నం, ఇసాబెల్లా బ్రిట్టో మా ఇంటికి వచ్చి, మరోసారి నన్ను బలవంతంగా GST కార్యాలయానికి రెండవసారి తీసుకువెళ్లారు, అక్కడ నన్ను ఆనంద్ కుమార్ బెదిరించారు. ఇంకొందరు అధికారులు నాతో తప్పుగా ప్రవర్తించారు" అని ఆమె చెప్పారు.
తొలుత బాధితురాలు తన ఫిర్యాదుతో ఎన్‌సీడబ్ల్యూని ఆశ్రయించగా, దాన్ని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదును పరిశీలించి, ప్రాథమిక ఇన్‌పుట్‌ల ఆధారంగా ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. రూ. 5 కోట్లు లంచం డిమాండ్ చేసినందుకు ఆమె భర్త సత్య శ్రీధర్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చేందుకు జీఎస్టీ అధికారులు రాత్రంతా అక్రమంగా జే రాఘవిరెడ్డిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అదే జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని సత్య శ్రీధర్‌రెడ్డి జగన్నగారిపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. అతని భార్య జె రాఘవి రెడ్డిని అక్రమంగా నిర్బంధించినందుకు హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు వారిపై కేసు పెట్టారు.