సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదానికి గురైన దక్కన్ మాల్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. గత నెల 19న దక్కన్ మాల్‌లో మంటలు చెలరేగి ఆరు అంతస్థుల భవనం కాలి బూడిదయిన ఘటనలో మాల్‌కు చెందిన ముగ్గురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. దాదాపు 10 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు. చుట్టుపక్కల నివాస గృహాల్లో ఉన్న వారిని అక్కడి నుంచి తరలించి వారికి తాత్కాలిక విడిదిని ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల భవనం ఏ క్షణానైనా కూలిపోవచ్చని నిపుణుల చేసిన హెచ్చరికలతో భవనం కూల్చివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి తలసాని యాదవ్ పలుమార్లు ఘటనా స్థలాన్ని సందర్శించి భవనం కూల్చివేత వల్ల చుట్టు నివాసాలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూల్చివేత పనులను జనవరి 27 నుంచి ప్రారంభించగా.. 14 రోజుల తరువాత శుక్రవారం తెల్లవారు జామున పనులు పూర్తయినట్లు సదరు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.