హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో భారీ ఎత్తున సాగుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీ ముఠా గుట్టును మాధాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు రట్టు చేశారు. ఇందిరమ్మ కాలనీలోని 'శ్రీ జస్నాత్ ట్రేడర్స్'పై దాడి చేసిన పోలీసులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాజస్థాన్‌కు చెందిన భన్వర్ రామ్ జాట్, అతని కుమారుడు అశోక్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు గడువు ముగిసిన వివిధ రకాల వంట నూనెలను తక్కువ ధరకు సేకరించి, వాటిని సోయాబీన్ నూనెతో కలిపి సరికొత్త ప్యాకింగ్‌లలో గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
అంతేకాకుండా, ఎక్స్‌పైరీ అయిపోయిన గోధుమ పిండిని కూడా సేకరించి 'జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా' పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో సుమారు రూ. 10.55 లక్షల విలువైన 5,026 లీటర్ల కల్తీ నూనె, రూ. 3.11 లక్షల విలువైన 5,192 కిలోల గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్యాకింగ్ మెషీన్లు, ఫిల్టర్ మెషీన్లు మరియు ఒక టెంపో ట్రాలీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు రూ. 21,91,980 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.