ఎలాంటి అసౌకర్యం క‌ల‌గొద్దు.. గ్లోబల్ సమ్మిట్‌పై అన్ని విభాగాల HODలతో పోలీసుల‌ సమీక్ష

రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, భారీ బందోబస్త్ మీద, అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అధికారులకు సూచించారు.

By -  Medi Samrat
Published on : 1 Dec 2025 9:20 PM IST

ఎలాంటి అసౌకర్యం క‌ల‌గొద్దు.. గ్లోబల్ సమ్మిట్‌పై అన్ని విభాగాల HODలతో పోలీసుల‌ సమీక్ష

రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, భారీ బందోబస్త్ మీద, అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అధికారులకు సూచించారు.

ఈరోజు ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9వ తేదీలలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పై రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, అడిషనల్ డీజీ డిఎస్ చౌహాన్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక IASతో కలిసి అన్ని విభాగాల HOD లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నీ రకాల సదుపాయాలను కల్పించాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా తమకు కేటాయించిన పనులను ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఇంటర్నెట్ సౌకర్యంలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. రవాణా సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ స్థలాల ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. మెడికల్ సిబ్బందితో అవసరమైన వద్ద శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ కు వివిధ ప్రాంతాల నుండి దేశాల నుండి డెలిగేట్స్ వస్తున్న సందర్బంగా విమానాశ్రయం నుండి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతంలో పారిశుద్ద్యం చేపట్టాలని చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని, రోడ్లపై ఎక్కడ ఎలాంటి చెత్త లేకుండా చూడాలని సూచించారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అగ్నిపక శాఖ అధికారులు ఎలాంటి సంఘటనలు జరగకుండ చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లుకు తావ్వివకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులని బాధ్యతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో డీసీపీ మహేశ్వరం నారాయణ రెడ్డి ఐపీఎస్, ప్రోటోకాల్ సెక్రటరీ నర్సింహా రెడ్డి, అధికారులు ప్రేమ్ రాజ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు ఎండి కె.అశోక్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి, ఆర్ అండ్ బి, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, టిజిఎస్పీడిసిఎల్, టూరిజం, ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story