ఆహారకల్తీ నేరం మాత్రమే కాదు, సమాజంపై ఘోరమైన దాడి..కల్తీగాళ్లకు సజ్జనార్ వార్నింగ్

ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, సమాజంపై జరుగుతున్న ఒక ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు

By -  Knakam Karthik
Published on : 30 March 2026 7:00 PM IST

Hyderabad News, Food Adulteration, CP Sajjanar, HFAST, HyderabadPolice

ఆహారకల్తీ నేరం మాత్రమే కాదు, సమాజంపై ఘోరమైన దాడి..కల్తీగాళ్లకు సజ్జనార్ వార్నింగ్

ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, సమాజంపై జరుగుతున్న ఒక ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు. పసిబిడ్డలు తినే బిస్కెట్లు, ఐస్ క్రీమ్‌ల నుండి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యమే పరమావధిగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఆయన అభినందించారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన 'H-FAST' బృందం కల్తీ ముఠాల గుట్టురట్టు చేస్తూ ఉక్కుపాదం మోపుతోందని వెల్లడించారు. గత నెల రోజుల్లోనే 61 కేసులు నమోదు చేసి, 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేయడంతో పాటు 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కల్తీ లేని సమాజం కోసం తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు.

Next Story