హైదరాబాద్: గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో అగ్రస్థానంలో కనిపించే ప్రతి వెబ్‌సైట్ అసలైనది కాదని, సైబర్ నేరగాళ్ల ఉచ్చు కావచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సైబర్ నేరగాళ్లు 'సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్' (SEO) మరియు పెయిడ్ యాడ్స్‌ను ఉపయోగించి నకిలీ వెబ్‌సైట్లను సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్‌లో ఉంచుతున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు లేదా ప్రభుత్వ పథకాల కోసం వెతికేటప్పుడు ఈ నకిలీ లింకులు 'Sponsored' లేదా 'Ad' పేరుతో కనిపిస్తాయి. వీటిని క్లిక్ చేయగానే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఐడీ, పాస్‌వర్డ్, సీవీవీ (CVV), ఓటీపీ (OTP) వంటి సమాచారాన్ని దొంగిలించి క్షణాల్లో ఖాతా ఖాళీ చేస్తారు. మీ గుర్తింపు పత్రాలతో ఇతర నేరాలకు పాల్పడే (Identity Theft) అవకాశం కూడా ఉంది.
పోలీసుల సూచనలు: వెబ్‌సైట్ అడ్రస్ (URL) స్పెల్లింగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. లింకులపై క్లిక్ చేయడం కంటే అధికారిక వెబ్‌సైట్ చిరునామాను నేరుగా టైప్ చేయండి. సెర్చ్ ఫలితాల్లో వచ్చే ప్రకటనల (Ads) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.