ఆ అమ్మాయిల విషయంలో జాగ్రత్త.. సజ్జనార్ హెచ్చరిక
మోసపోయే వాళ్లు ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
By - Medi Samrat |
మోసపోయే వాళ్లు ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మాట్లాడుకోవాలంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని, ఏఐ జనరేటెడ్ వీడియోల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి యాడ్స్ వెనుక ఉన్నది నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చని తెలిపారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని తెలిపారు. మాయమాటలకు బుట్టలోపడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని అన్నారు. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడదామని వీడియో కాల్ చేస్తే అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారని, ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్ కు దిగుతారని హెచ్చరించారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని సజ్జనార్ తెలిపారు. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువుపోతుందేమో అని భయపడవద్దని, వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.