షాద్‌న‌గ‌ర్ వాసుల‌కై ఉచిత అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంబించిన సీపీ స‌జ్జ‌నార్‌

CP Sajjanar Starts free Ambulance Service. ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat  Published on  10 May 2021 8:01 PM IST
షాద్‌న‌గ‌ర్ వాసుల‌కై ఉచిత అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంబించిన సీపీ స‌జ్జ‌నార్‌

ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి భారతదేశ ఆరోగ్య వ్యవస్థకు ఓ సవాల్ విసిరింది. ఈ మహమ్మారిని అంతం చేయడమే కాకుండా.. దీని వలన బాధపడుతున్న వారిని ఆదుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముందుకు వచ్చి సేవ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 'వెన్నుపూస ఫౌండేషన్' కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకోడానికి ముందుకు వచ్చింది. అంబులెన్స్ సర్వీసులను తీసుకుని వచ్చింది. సైబరాబాద్ కమీషనర్ ఏడీజీపీ విసి సజ్జనార్ 'వెన్నపూస ఫౌండేషన్' కు చెందిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను సైబరాబాద్ సీపీ ఆఫీసులో జెండా ఊపి మరీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, CAR హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, వెన్నపూస ఫౌండేషన్ ఛైర్మన్ సుబ్బా రెడ్డి వెన్నపూస, వెన్నపూస ఫౌండేషన్ కమిటీ మెంబర్లు వి.ఆర్. రామి రెడ్డి, వి.ఆర్.విగ్నేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సజ్జనార్ జెండా ఊపి వెన్నపూస ఫౌండేషన్ కు చెందిన ఫ్రీ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించారు. ఈ బృహత్కర కార్యక్రమానికి నాంది పలికిన వెన్నపూస ఫౌండేషన్ ఛైర్మన్ సుబ్బా రెడ్డి వెన్నపూసను, వెన్నపూస ఫౌండేషన్ కమిటీ మెంబర్లు వి.ఆర్. రామి రెడ్డి, వి.ఆర్.విగ్నేశ్వర్ రెడ్డి లను సజ్జనార్ ప్రశంసించారు. ఇలాంటి కష్టసమయాల్లో పేదలకు అండగా నిలిచే పనులు చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు.

వెన్నపూస ఫౌండేషన్ ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అంబులెన్స్ లు దొరక్క ఎంతో మంది బాధపడుతూ ఉన్నారని, ఒకవేళ దొరికినా ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసులు భారీ రేట్లతో దోచేస్తూ ఉన్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా పేపర్లలోనూ, టీవీ ఛానల్స్ లోనూ మనం చూస్తూ ఉన్నామని.. ఇలాంటి కష్ట సమయాల్లో కొందరికైనా తోడుగా నిలవాలనే ఆకాంక్షతో ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసులను మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చర్చించగా.. వారు కూడా మంచి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారని సుబ్బారెడ్డి వెన్నపూస అన్నారు.

ఈ విషయమే సజ్జనార్ గారితో కూడా చర్చించామని.. ఆయన కూడా ఇది మంచి పనే అంటూ ప్రోత్సహించారని తెలిపారు. చిన్న చిన్న పట్టణాలలోని పేదల కోసమే తాము ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసులను తీసుకుని వచ్చామని చెప్పారు. తాము గత కొన్నేళ్లుగా షాద్ నగర్ లో వ్యాపారాలు నిర్వర్తిస్తూ ఉన్నామని.. అక్కడి పరిస్థితులు తమకు తెలుసునన్నారు. షాద్ నగర్ టౌన్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసుల కోసం తాము అంబులెన్స్ సర్వీసులను తీసుకుని వచ్చామని అన్నారు. అంబులెన్స్ అవసరం ఉన్నవాళ్ళు వెన్నపూస ఫౌండేషన్ కు చెందిన 7710872108 నెంబర్ కు కాల్ చేయాలని సుబ్బారెడ్డి వెన్నపూస కోరారు.




Next Story