సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పాకులాడుతూ విలువలను విస్మరిస్తున్న వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకర పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా డబ్బు, స్పాన్సర్‌షిప్‌ల కోసం 'Thirst Trap' వంటి పద్ధతులతో సంస్కృతిని కలుషితం చేయడం దుర్మార్గమని, ఇది చిన్నారులు, యువత మనసులపై విషం చిమ్ముతోందని పేర్కొన్నారు. 'రీల్' ప్రపంచంలో వచ్చే చప్పట్ల కోసం 'రియల్' లైఫ్ గౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు.
ఇలాంటి అసభ్యకర కంటెంట్‌కు ఇచ్చే ప్రతి లైక్, షేర్ అసాంఘికతను పెంచి పోషించడమేనని నెటిజన్లను హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి అశ్లీలతను ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాను బాధ్యతాయుతమైన విజ్ఞాన వేదికగా మార్చుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.