రాజా సింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న సజ్జనార్
CP Sajjanar Counter to BJP MLA Rajasingh. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పోలీసులు అండగా ఉన్నారంటూ బీజేపీ నాయకులు ఇటీవలి
By Medi Samrat Published on 22 Dec 2020 1:19 PM GMTటీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పోలీసులు అండగా ఉన్నారంటూ బీజేపీ నాయకులు ఇటీవలి కాలంలో తరచుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాదులో మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీసులను ఉద్దేశించి బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు ఆవులను తరలిస్తున్న లారీని రాజాసింగ్ పట్టుకున్నారు. చౌటుప్పల్ చెక్ పోస్టు వద్ద లారీని అడ్డుకున్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సజ్జనార్ రిప్లై ఇచ్చారు.
మహారాష్ట్ర నుంచి అక్రమంగా బహదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీని గత రాత్రి చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద వెంబడించి మరీ పట్టుకున్నారు రాజా సింగ్. అనంతరం ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరుపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. గోవధపై బహదూర్ పుర మునిసిపల్ కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.