రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం.. దిమ్మతిరిగే విషయాలు బయటపెట్టిన సీపీ
CP reveals details of Rs 200 crore herbal products scam, drugs racket. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుంది.
By Medi Samrat Published on 7 July 2023 2:30 PM GMTతెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాదకద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్కు తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠాలపై నిఘా పెట్టి వారిని ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా చేసుకొని రహస్యంగా డ్రగ్స్ సరఫరా ముఠాను పట్టుకునేందుకు నెలరోజుల పాటు బెంగుళూరు లో ఉండి ముఠాపై నిఘా పెట్టి చిట్టచివరకు నిందితులను పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ముగ్గురు నైజీరియన్లు అగ్ బో మ్యాక్స్ వెల్, ఇకెం ఆస్టిన్ ఒబాక, ఒకేకే చిగోజి లతోపాటు.. హైదరాబాద్ కి చెందిన సాయి ఆకేష్ ని పట్టుకున్నమని తెలిపారు. నైజీరియా కి చెందిన మరో పెడ్లర్ మాజీ పరారీలో ఉన్నాడు. ఇందులో మ్యాక్స్ వెల్ ప్రధాన సూత్రధారి అని వెల్లడించారు. మ్యాక్స్ వెల్, చిగోజీ ఇద్దరూ.. మెడికల్ వీసా పై ఇండియా వచ్చారు.. ఆస్టిన్ ఒబాక స్టూడెంట్ విసా పై వచ్చాడు. ఇప్పటివరకు ఎన్నో డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నాం.. కానీ ఈ గ్యాంగ్ మాత్రం చాలా తెలివిగా పోలీసుల చేతికి ఏ మాత్రం చిక్కకుండా రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. అంతేకాకుండా ఈ నిందితులు తెలివిగా ఫేక్ అడ్రస్ లతో బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసారని వెల్లడించారు.
ఆరు నెలల్లో 4 కోట్ల రూపాయల లావాదేవీలు వీళ్ల అకౌంట్స్ ద్వారా జరిగాయి. అంతేకాకుండా ఈ నిందితులంతా.. బెంగుళూరు ను కేంద్రంగా చేసుకొని అక్కడి నుండి గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు.. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్ కి చెందిన సంజయ్ కుమార్, తుమ్మ భాను తేజను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశామని.. వీళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఈ ముఠా ను పట్టుకున్నామని సీపీ అన్నారు.
హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం
ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా నడుస్తున్న రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బట్టబయలైందని సీవీ ఆనంద్ ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు తెలిపారు. వనమూలికలతో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల పేరిట ఈ ముఠా దేశం మొత్తంమ్మీద దాదాపు 7 వేల మందికి టోకరా వేసిందని వెల్లడించారు. నెలవారీ చెల్లింపుల పేరిట అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారని వివరించారు. ఇందుకోసం పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టారని తెలిపారు.
"పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్ ప్రకారం.. రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్ ప్రకారం.. రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఐడీ స్కీమ్ అని మరొకటి ఉంది. దీంట్లో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇలాంటి పేమెంట్లే కాదు.. కార్లు, ఫ్లాట్లు, విహారయాత్రలు, బైకులు, ల్యాప్ టాప్ లు, నగలు కూడా కానుకలుగా ఇస్తామని ప్రజలను నమ్మించారు.
వీరి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో జనాలు భారీగా డబ్బులు కట్టి స్కీమ్ లలో చేరారు. క్యూ మార్ట్ మోసాల కేసు దర్యాప్తు చేస్తుంటే, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బయటపడింది. ఈ కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. పూజా కుమారి, షకీలా అనే మహిళలు పరారీలో ఉన్నారు" అని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.