డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు
Constable Candidates Protest at DGP Office in Hyderabad. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ
By Medi Samrat
తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. పలువురు అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
2022 నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలో నియమకాలను చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీవో నెంబర్ 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకు దిగిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్లో రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన జీవో 46ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరుతున్నారు. 2016, 2018లలో స్పెషల్ పోలీసు నియామకాలు రాష్ట్రస్థాయిలో చేపట్టారని.. 2022 నోటిఫికేషన్‌లో మాత్రం ఆ పోస్టులను జిల్లాస్థాయికి కుదించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగానే భర్తీ చేయాలన్నారు. జీవో 46 కారణంగా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకే 53 శాతం పోస్టులు వెళ్తుండగా.. దీనివల్ల మిగిలిన జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.