తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుని వెళ్తోంది. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనుకూలంగా రావడంతో ఫుల్ జోష్ లో ఉంది. మరో వైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని భావిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గన్ ఫౌండ్రీకి చెందిన ఇరువర్గాలు హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బాహాబాహీకి దిగాయి.
శైలేందర్ యాదవ్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీ ఫారం తీసుకునేందుకు ఓంప్రకాశ్ బీజేపీ కార్యాలయానికి రాగా, శైలేందర్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓంప్రకాశ్ కు టికెట్ ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. కుర్చీలు విసిరేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో నాయకులంతా షాక్ కు గురయ్యారు. ఎన్నికల ముందు అందరూ కలుపుకుని వెళ్ళాలి కానీ.. ఇలాంటి గొడవలేంటో అని బీజేపీ నాయకులు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కొందరు అంటూ ఉన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఇచ్చే ప్రాధాన్యత.. ఎప్పటి నుండో ఉండే నాయకులకు ఇవ్వడం లేదని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.