మూసీ తీరాన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన!
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
By - అంజి |
మూసీ తీరాన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన!
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద నిర్మించ తలపెట్టిన ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి చేవెళ్ల మండలం ఎంకే పల్లి వద్ద నిర్మించిన ఆధునిక గోశాలను కూడా ప్రారంభించారు. అంతకుముందు మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం గోపూజ నిర్వహించారు.
రూ. 700 కోట్లతో భారీ ప్రాజెక్టు:
చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సముదాయానికి సమీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఓంకారేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. శృంగేరి శారదా పీఠం జగద్గురువుల మార్గదర్శకత్వంలో ఈ ఆలయ నమూనాను సిద్ధం చేశారు. ప్రాచీన శిల్పకళా వైభవం ఉట్టిపడేలా, ఆధునిక వసతులతో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
అద్భుతమైన నిర్మాణ విశేషాలు:
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తులో గాలి గోపురం నిర్మించనున్నారు. 207 అడుగుల పొడవుతో ఉండే సెంట్రల్ మండపంలో ఓంకారేశ్వర ప్రధాన స్వయంభూలింగం కొలువై ఉంటుంది. గర్భాలయ గోపురం 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. హోమాలు, క్రతువులు మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 2,000 వాహనాలు నిలిపేలా అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
రామప్ప, యాదగిరిగుట్ట తరహాలో శిల్పకళ:
ఈ ఆలయ నిర్మాణానికి రామప్ప మరియు యాదగిరిగుట్ట వంటి ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో ఉపయోగించిన కృష్ణశిల (నల్ల రాయి) వంటి రాళ్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరానికి ఇది మరొక ప్రధాన పర్యాటక మరియు ఆధ్యాత్మిక ఆకర్షణగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.