హైదరాబాద్: హయత్‌నగర్‌లో మూగబాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధికుక్కల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై సీఎంవో, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. బాలుడు ప్రేమ్ చంద్ వైద్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.బాలుడి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
అటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సైతం ప్రేమ్ చంద్ ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పబ్లిక్ ప్లేస్ లలో వీధి కుక్కలు లేకుండా ఇప్పటికే చేపట్టిన డ్రైవ్ ను మరింత ముమ్మరం చేయాలన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లు ఈ ఘటనపై ఆరా తీసి బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.