మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

By -  Knakam Karthik
Published on : 23 March 2026 5:30 PM IST

Hyderabad News, Musi Rejuvenation, Cm Revanthreddy, Cabinet Sub-Committee, Hyderabad Development, Musi Project

మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మెగా ప్రాజెక్టుపై పర్యవేక్షణ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సోమవారం శాసన మండలిలో మాట్లాడిన ఆయన, మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ఏ ఒక్కరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉండి పునరావాసం కల్పిస్తుందని గట్టి భరోసా ఇచ్చారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. ఒకవేళ ప్రతిపక్ష నేతలు తనకు నేరుగా సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది పడితే, కేబినెట్ ఉపసంఘం ద్వారా తమ సలహాలను అందజేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని, ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Next Story