వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా కోటి దిపోత్సవం: సీఎం రేవంత్
కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By - అంజి |
వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా కోటి దిపోత్సవం: సీఎం రేవంత్
కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. పుట్టిన రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా భక్తి టీవీ చానెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులచే పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా జరిగిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించారు.
కోటి లింగేశ్వర స్వామి వారికి శత అష్టోత్తర పంచ మహా హారతులను ఇచ్చారు. స్వర్ణ మహాలక్ష్మి మాతకి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అశేషంగా హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన 14 సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులను, రచన టెలివిజన్ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొదట హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల్లో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవుడి నామస్మరణ వినిపిస్తున్నారని, ఇంతటి అద్భుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేశారు.
జన్మదినం రోజున భక్తుల సమక్షంలో గడుపుకోవడం తనకు జీవిత కాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగులుతుందని చెబుతూ, ముఖ్యమంత్రి భక్తకోటికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మక కార్యక్రమాల ద్వారా దేశంలోనే అత్యధికంగా వీక్షించే భక్తి చానెల్‌గా కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందడం అభినందనీయమని అన్నారు. ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుందని, ఆ శక్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడం, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కోట్లాది మంది భక్తులు తనకు శక్తిని ఇవ్వాలని కోరారు. వేలాదిగా హాజరైన భక్తుల సమక్షంలో స్వామి అమ్మవారి వాహన సేవను తిలకించారు. రేవంత్ రెడ్డి దంపతులు వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి వామనాశ్రమ మహాస్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. కాజీపేట శ్వేతార్క మహాగణపతి అనుగ్రహం తీసుకున్నారు. కార్తీక దీపారాధన చేశారు. అనంతరం సప్త హారతిని వీక్షించారు.