'హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ మారుస్తాం'.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్...

By -  అంజి
Published on : 14 Nov 2025 7:10 AM IST

CM Revanth Reddy, major roads, Hyderabad, name,big companies

'హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ మారుస్తాం'.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు అత్యుత్త‌మ గమ్యస్థాన‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఈరోజు ఢిల్లిలో జ‌రిగిన అమెరికా - భార‌త‌దేశం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు.

తెలంగాణ‌లో గ‌త 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్ర‌భుత్వాలకు సార‌థ్యం వ‌హించినా పెట్టుబ‌డుల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ ముఖ ద్వార‌మ‌ని తెలిపారు. జీసీసీల‌కు గ్య‌మ‌స్థానంగా ఉన్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు రావాల‌ని కోరుతూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు.

మ‌హిళా సాధికారిత‌, నాణ్య‌మైన విద్య‌, యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధితో పాటు మెరుగైన వ‌స‌తులు, అత్యున్న‌త జీవ‌న ప్ర‌మాణాల‌తో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిల‌ప‌డ‌మే త‌న ప్ర‌థ‌మ ప్రాధాన్యత అని ముఖ్య‌మంత్రి స్పష్టం చేశారు. గ‌త 23 నెల‌ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను సదస్సులో వివ‌రించారు. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తులతో 30 వేల ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశంలోనే నూత‌న న‌గ‌రంగా మారుతుంద‌ని చెప్పారు.

మూసీ న‌దీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుంద‌ని వివరించారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల పురోగ‌తిని వివ‌రించిన ముఖ్య‌మంత్రి చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు.

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే త‌క్కువ ఖ‌ర్చు, సుల‌భ‌మైన వీసా విధానాల‌తో ద‌క్షిణాది దేశాల (గ్లోబ‌ల్ సౌత్‌) విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య ల‌భిస్తుంద‌ని పేర్కొంటూ ప్ర‌పంచ స్థాయి విద్యా సంస్థలను ఆహ్వానించారు.

భారతదేశంలో రోడ్ల‌కు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయ‌ని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్ ను మార్చాల‌ని తాము అనుకుంటున్నామ‌ని చెప్పారు. ముఖ్య‌మైన రోడ్ల‌కు గూగుల్‌, మెటా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీ పేర్ల‌ను పెడ‌తామ‌ని అన్నారు.

స‌ద‌స్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్ ను ప్ర‌ద‌ర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఢిల్లీలో జరిగిన అమెరికా - భార‌త‌దేశం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స‌ద‌స్సు వార్షిక సమావేశంలో విశేష ఆదరణ లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరించిన ముఖ్యమంత్రి ప్రసంగం, అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.

Next Story