ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు.. ఏం కావాలో నన్ను అడగండి: సీఎం రేవంత్‌

తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి
Published on : 26 Aug 2025 6:49 AM IST

CM Revanth, develop Osmania University, Telangana, Hyderabad

ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు.. ఏం కావాలో నన్ను అడగండి: సీఎం రేవంత్‌

తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన, తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అవుతుందని అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినీ విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడిండ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఉస్మానియా వర్సిటీని ఒక అద్బుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా శాఖ నిపుణలతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాని ఆదేశించారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

"విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఉస్మానియా కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి ఇబ్బందేమీ లేదు. రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం 20 వేల కోట్లు, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి రూ.500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం.

ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు. ఈ వర్సిటీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాలి. ప్రపంచ ప్రమాణాలతో అద్బుతమైన వర్సిటీగా రూపొందించడానికి ఏం కావాలో అడగండి. రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఈ యూనివర్సిటీని గాలికొదిలేయడం సరికాదు. ఈ యూనివర్సిటీకి మరోసారి వస్తా. ఈసారి ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సభ పెట్టుకుందాం. యూనివర్సిటీని అభివృద్ధి చేయడంలో నాకు చిత్తశుద్ధి ఉంది. అంచనాలు రూపొందించండి.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు, నాయకులు ఇక్కడి నుంచి వచ్చిన వారే. తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా నుంచే ఆ సమస్య మాది అని భావించేదే ఈ నిలయం.

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియాను కాలగర్భంలో కలిపేయాలన్న కుట్ర జరుగుతున్న సందర్భంలో ఈ వర్సిటీకి పూర్వ వైభవం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ఆలోచనలు చేశాం. రాష్ట్రంలోని యూనివర్సిటీలు అన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం.

ఉస్మానియా వర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితుడు వైస్ చాన్సెలర్ కాలేదు. ప్రస్తుతం వీసీ మొలుగరం నైపుణ్యాన్ని గుర్తించి వీసీగా నియమించాం. అలాగే మిగతా యూనివర్సిటీలు, విద్యా కమిషన్‌కు అలాగే నియమించాం.

వర్సిటీలు ఉద్యోగులు, అధికారులను ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాసంపత్తిని అందిస్తుందని ఆశిస్తున్నాం. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు వయసున్న యువత 65 శాతం ఉంది. యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయ పరిమితిని 21 సంవత్సరాలకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలి.

యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. సాంకేతిక పరమైన చర్చలు జరగాలి. వర్సిటీలు, విద్యాలయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించడం లాంటి వ్యసనాల బారిన పడటానికి దారితీస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పంచడానికి భూములు లేవు. ఖజానాలో ఖాళీగా ఉంది. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు నా సూచన ఒక్కటే నాణ్యమైన విద్య ఒక్కటే మన తలరాతలను మార్చగలుగుతుంది.

విద్యార్థినీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చాను. సమస్యలు పరిష్కరించడానికి వచ్చినప్పుడు వ్యతిరేకించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వారవుతారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉపాధ్యాయ నియామకాల కోసం కేవలం 55 రోజుల్లో 11 వేల మంది టీచర్లను నియమించాం. వచ్చే ఆరు నెలల్లో ఇంకో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల కాలం నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో వేల కోట్ల పెట్టుబడులను తేవడమే కాకుండా 1.5 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించాం.

అపోహలకు లోను కావద్దు. అనుమానాలు ఉంటే నివృతి చేస్తాం. అబద్దాలను నమ్మకండి. కొందరు జీర్ణించుకోలేక ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. అలాంటి వారు తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదల్లాంటి వారు. ఉస్మానియా వర్సిటీని ఉంచకూడదని, ఎవరూ చదువుకోవద్దని కోరుకునే వారు.

2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మీరంతా చదువుకోవాలి. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు.." అని ముఖ్యమంత్రి సవివరంగా మాట్లాడారు.

Next Story