హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్, వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం తదితరులు ఉన్నారు.
ఇదిలావుంటే.. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ముకర్రం ఝా భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చిన తరువాత చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. ఈరోజు నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతిచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు నిజాం అభిమానుల సందర్శనార్ధం ముకర్రం ఝా భౌతికకాయాన్ని ఉంచనున్నారు. మద్యాహ్నం రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.