ఏప్రిల్ 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌.. ఈసారి కూడా కేసీఆర్ గైర్హాజరు.!

తెలంగాణలో ఏప్రిల్ 8న హైదరాబాద్‌ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలో

By అంజి  Published on  6 April 2023 2:00 AM GMT
ఏప్రిల్ 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌.. ఈసారి కూడా కేసీఆర్ గైర్హాజరు.!

తెలంగాణలో ఏప్రిల్ 8న హైదరాబాద్‌ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) ఆహ్వానాలు అందాయని, దీనికి ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

టీఎస్‌పీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్టుపై బీఆర్‌ఎస్‌, బీజేపీ తీవ్ర రాజకీయ యుద్ధంలో చిక్కుకున్నాయి. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలకరని, ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదని వర్గాలు తెలిపాయి. బదులుగా కేసీఆర్‌ నగరంలో జరిగే ప్రధానమంత్రి కార్యక్రమాలకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను డిప్యూట్ చేసే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్‌ చివరిసారిగా 2021 సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని కలిశారు. అక్టోబర్ 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ వైరం కారణంగా ఆయన అప్పటి నుండి ప్రధాని మోదీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలు కాబట్టి.. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవడంతో పాటు విమానాశ్రయంలో ఆయనను కలవాలి. అయితే ఈ మధ్య కాలంలో నగర శివార్లలోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని ప్రారంభించేందుకు, వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకలేదు.

రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ను పాటించకపోవడానికి ప్రధానమంత్రి "ప్రైవేట్ పర్యటనలు" కారణమని సీఎంవో పేర్కొంది. హెచ్‌ఐసిసిలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి మోడీ 2022 జూలైలో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇవి పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు కావు కాబట్టి కేసీఆర్‌ను మోదీ తప్పించారు.

అయితే, రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)ని ప్రారంభించేందుకు 2022 నవంబర్‌లో ప్రధాని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఇది అధికారిక కార్య‌క్ర‌మ‌మైనా సీఎం కార్య‌క్ర‌మానికి రాలేదు. ఈ సంద‌ర్భాల‌న్నింటిలోనూ ప్ర‌ధాన మంత్రిని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుని వీడ్కోలు పలకాలని సీఎం.. మంత్రి తలసానిని ఆదేశించారు.

Next Story