11 ఏళ్ల విద్యార్థి స్కూలు భోజన విరామ సమయంలో ఒకేసారి మూడు పూరీలు తింటుండగా గొంతులో ఇరికి ఊపిరాడక చనిపోయాడు. సికింద్రాబాద్‌లోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న బాలుడిని వీరేన్ జైన్‌గా గుర్తించారు. సోమవారం పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలుడి తండ్రి గౌతమ్ జైన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన కొడుకు భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పాఠశాల నుండి కాల్ వచ్చింది. అతను ఒకేసారి రెండు పూరీలకు మించి తినడం వల్ల ఊపిరి పీల్చుకోలేక చనిపోయాడని పాఠశాల తెలిపింది.
బేగంపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు లంచ్ బాక్స్‌లో పూరీలు పెట్టుకుని వెళ్లాడు. భోజన విరామ సమయంలో బాలుడు ఒకేసారి మూడు పూరీలు తినడానికి ప్రయత్నించాడు. అవి గొంతులో ఇరికి ఉక్కిరిబిక్కిరి అవడంతో బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం వెస్ట్ మారేడుపల్లిలోని గీతా నర్సింగ్ హోంకు తరలించారు. అక్కడి డ్యూటీ డాక్టర్లు సికింద్రాబాద్‌లోని బాలుడిని అపోలో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అపోలో ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారు. తన కుమారుడి మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.